సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జగన్‌మోహన్‌రెడ్డి భయం పట్టుకుందని, అందుకే ఆయనపై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా సమైక్యం కోసం ముందుకు రావాలని తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిస్తే... చంద్రబాబు దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా తన బాధ్యతను మరిచిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు నిజంగా మతిపోయి పిచ్చి పడితే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరాలే తప్ప అనవసరంగా జగన్‌పై అర్థంలేని విమర్శలు చేయరాదని హితవు పలికారు. జూపూడి శనివారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజిస్తే... సీమాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్ల రూపాయలివ్వాలని చెబుతూ చంద్రబాబు కాంట్రాక్టర్లను పెంచిపోషించే వ్యక్తిగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
ప్రజల పట్ల తనకున్న బాధ్యతను గుర్తెరిగిన వ్యక్తిగా జగన్ జైల్లో ఉండి కూడా సమైక్యం కోసం ఏడు రోజులు నిరాహారదీక్ష చేశారని, బయటకు వ చ్చాక కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీల మద్దతు కూడా కూడగట్టేందుకు జగన్ పర్యటన చేయనున్నారని చెప్పారు. చంద్రబాబు రాజకీయ నాయకుడి రూపంలో ఉన్న నేరస్తుడని వ్యాఖ్యానించారు. జగన్ వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేధావిగా అందరికీ నీతులు చెప్పే జేపీ, చంద్రబాబు ఏం చెబితే దానికి తబలా వాయిస్తున్నారని దుయ్యబట్టారు.
http://www.sakshi.com/news/top-news/jupudi-prabhakar-rao-takes-on-chandrababu-naidu-79652
Post a Comment