విభజనంటే గుళ్లో కొట్టిన టెంకాయలా ఉండాలి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొత్త సిద్ధాంతం
సాక్షి, హైదరాబాద్: భాషను పరిపుష్టం చేయడానికి తెలుగులో జాతీయాలతో పాటు కొన్ని న్యాయాలను పురాతన కాలం నుంచి కూడా విరివిగా వినియోగిస్తాం. ఇకపై వాటిల్లో విభజన విషయంలో ఎలాంటి న్యాయాలున్నాయి అని వెతుక్కోనవసరం లేదు. ఎందుకంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓ కొత్త న్యాయం ప్రవేశపెట్టారు. అదే కొబ్బరికాయ న్యాయం. దానికి ఆయన ఎలా నిర్వచనం ఇచ్చారంటే.. ‘మనలో ఎవరైనా గుడికి వెళ్లినపుడు కొబ్బరికాయ (టెంకాయ) కొడితే సమంగా పగలాలని కోరుకుంటాం. ఒకవేళ సరిగా పగలకపోతే ఏంటి ఇలా పగిలింది అని బాధపడతాం. సమానంగా పగిలితే ఆ రోజు మంచి జరుగుతుందని సంతోషపడతాం. రాష్ర్ట విభజన విషయంలో నేను కూడా ఇదే కోరుకుంటున్నాను’’ అన్నారు.
విభజనకు సంబంధించి 11 అంశాలపై అభిప్రాయాలు తెలపాలని జీవోఎం టీడీపీకి లేఖ రాసి సమయమిస్తే.. అదే సమయానికి అనగా.. బుధవారం ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు తన నివాసంలో విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా ఆ న్యాయోపాఖ్యానం చేశారు. అంతే కాదు మళ్లీ ఆవు కథ అందుకున్నారు. ‘‘ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు విడిపోవాలని నిర్ణయించుకుంటారు. అటువంటప్పుడు తండ్రి ఏ ఒక్కరికో న్యాయం చేయాలని చూడరు. నలుగురు పెద్ద మనుషులను కూర్చోబెట్టి ఇద్దరికీ సమన్యాయం జరిగేలా చూస్తారు. ఇపుడు నేను కోరుతున్నది కూడా అదే’’ అంటూ తండ్రి న్యాయం వల్లెవేశారు. అయితే ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధులను టీడీపీ అనుమతించలేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా చంద్రబాబు న్యాయాలను సాక్షి సేకరించింది. ఒక వేళ అనుమతిస్తే ప్రజల తరఫున ‘సాక్షి’ ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టి ఉండేది.
1. కొబ్బరికాయ న్యాయాన్ని విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదు?
2. సమన్యాయం అంటే రాయల తెలంగాణను ఏర్పాటు చేసి చెరో పక్క 21 పార్లమెంట్ స్థానాలు ఉండేటట్లు చూడడమా?
3. విభజనకు అనుకూలంగా 2008లో ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చి ఐదేళ్లు గడిచింది కదా.. ఈ కాలంలో సమన్యాయం చేసిన తర్వాతే విభ జించాలని ఎందుకు కోరలేదు?
4. కేసీఆర్, బొత్స హోంమంత్రితో రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నిస్తున్న మీరు.. గతంలో కేంద్ర మంత్రి చిదంబరాన్ని చీకట్లో కలిసిన సంగతేంటి?
http://www.sakshi.com/news/top-news/chandrababu-naidu-new-theory-on-state-bifurcation-80606
Post a Comment