Home » , , , , , , , , » హ్యూమరం: కోకోనట్ థియరీ

హ్యూమరం: కోకోనట్ థియరీ

హ్యూమరం: కోకోనట్ థియరీ
http://www.sakshi.com/news/funday/journalists-asks-chandrababu-naidu-about-coconut-theory-83013

బాబు విలేకరుల సమావేశం.‘‘రాష్ట్రం గురించి మీ అభిప్రాయం?’’ అడిగారు విలేకరులు. ‘‘కొబ్బరికాయలా సమంగా పగలాలి. గుమ్మడికాయలా ముక్కలు కాకూడదు. ప్రతిదీ పండే కదాని అన్నిటినీ ఒక్కలా తినకూడదు. అరటికి తొక్క తీయాలి. ఆపిల్‌ను కోసి తినాలి. పైనాపిల్ చెక్కు తీయాలి. ద్రాక్షను గుటుక్కున మింగాలి. సీతాఫలంలో విత్తనాలు ఊసేయాలి...’’
 
 ‘‘కొబ్బరికాయ గోలేంటి సార్?’’
 ‘‘గోలలోనే గోల్ ఉంటుంది. కొబ్బరిని నారికేళమంటారు. నా రాజకీయాన్ని నారావారి కేళమంటారు. కొబ్బరి నీడ కొంప ముంచుతుంది. కాయ నెత్తిన పడితే కైలాసం ఫ్రీ. ఇడ్లీలోకి చెట్నీ అవుతుంది. మటన్‌లోకి మసాలాగా మారుతుంది. పది వంకాయలు కూడా ఒక టెంకాయతో సమానం కావు.’’
 
 ‘‘మేమడిగిందేంటి?’’
 ‘‘అడిగేవాడికే జ్ఞానం. కడిగేవాడికే పాత్రలు. కొబ్బరిలోకి నీళ్లెలా వచ్చాయో తెలుసుకోవడమే జ్ఞానం. నీళ్లు నూనెగా మారడమే విజ్ఞానం. తలకు నూనె రాస్తే, తలరాతలు మారుతాయనుకోవడం అజ్ఞానం. అలలను, కలలను ఎవరూ ఆపలేరు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నా కల. ఓటర్లకు వాగ్దానం చేయడం ఓ వల. అల, కల, వల అన్నీ రాజకీయమే. పీచే కదాని చులకన చేయకు. అదే ఒకనాడు పరుపవుతుంది.’’
 
 ‘‘మీరెప్పటికీ మారరా?’’
 ‘‘ప్రపంచంలో ఎప్పటికీ మారనిది కొబ్బరికాయే. శతాబ్దాల క్రితం దేవుడికి కొబ్బరికాయే కొడుతున్నాం. ఇప్పుడూ అదే. తీర్థమిచ్చిన ప్రతివాడూ పూజారి కాదు. ప్రసాదం తిన్న ప్రతివాడూ భక్తుడు కాదు. భక్తికీ కొబ్బరికాయకీ ఉన్న అనుసంధానమే ఈ రాష్ట్రం. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటరుకూ ఒక కొబ్బరికాయ కొడతా. ఓటేయకపోతే నెత్తిన కొడతా. టెంకాయ సమంగా పగలకపోతే ఢిల్లీదే తప్పు...’’
 విలేకరులు కుయ్యో మొర్రో అన్నారు.
 ‘‘కుయ్యోమని కూయమంటే కోడి కూయదు. మొర్రోమన్నా మేకని వదలరు. కూతలు, కోతలు రెండూ ఒకటే. టెంక ఉన్నంత మాత్రాన మామిడి టెంకాయగా మారదు. కొబ్బరి కొబ్బరే, మామిడి మామిడే. కొబ్బరిని ఇంగ్లిష్‌లో కోకోనట్, హిందీలో నారియల్ అంటారు.’’
 
 ‘‘సార్, స్టేట్ పరిస్థితి...’’
 ‘‘స్టేట్‌మెంట్‌లతో స్టేట్ మారదు. స్టేట్‌లు మారినా స్ట్రీట్‌మారదు. ఏ స్టేట్‌లో ఉన్నా మన ఎస్టేట్‌లు ఉన్నాయా లేదా, మన స్టేటస్ ఏంటి అన్నది ముఖ్యం.’’
 విలేకరులు పారిపోవడానికి ప్రయత్నించారు. తలా ఒక కొబ్బరి బర్ఫీని తినిపించాడు బాబు.
 ఆ తరువాత వాళ్లు ఎటుపోయారో తెలియదు. పత్రికా కార్యాలయాలకు, టీవీ చానళ్లకు చేరలేదు.
 - జి.ఆర్.మహర్షి
 
 మహర్షిజం
 ఢిల్లీ నాటకం: నాయకులు తెల్లమొహాలేసి, జనాల మొహాలకు రంగు పూస్తున్నారు.
 తెలుగు తమ్ముడి కామెంట్: అర్థమయ్యేలా మాట్లాడటం మా చంద్రబాబు డిక్షనరీలోనే లేదు.
 కిరణ్ ఏం చేస్తున్నాడు? హార్స్ రేస్‌ల కోసం చెక్క గుర్రంపై ప్రాక్టీస్ చేస్తున్నాడు.
 రాజకీయమంటే: ఎన్నటికీ రాని రైలుకి టికెట్లు అమ్మడం!
 మన నాయకుల ప్రత్యేకత: బాల్, గోల్ రెండూ లేకుండా ఫుట్‌బాల్ ఆడటం!
 కాంగ్రెస్ నాయకుడి ఆవేదన: ఆయుధాలన్నీ ఢిల్లీవాళ్లు లాక్కుని, యుద్ధానికి వెళ్లమంటున్నారు.
Share this article :

Post a Comment