Home » , , , , , , , » చిన్నబోయిన బుద్దా

చిన్నబోయిన బుద్దా

చిన్నబోయిన బుద్దా
మాటలే తప్ప చేతల్లో బాబు  తీరు మారలేదు.. బలహీన వర్గాల నేతలంటే ఆయనకున్న చిన్నచూపు పోలేదు.. పార్టీ పదవున్నా ఆయన ప్రాపకం లేకపోతే తగిన గౌరవం దక్కదనే విషయం మరోమారు రుజువైంది. నగరంలో మీడియా సమావేశం నిర్వహించి.. కొత్తగా పార్టీ అర్బన్ పగ్గాలు చేపట్టిన బుద్దా వెంకన్నకు ఆ వేదికపై చోటుకల్పించకపోవడంపై పలువురు కార్యకర్తలు, నేతలు విస్తుబోతున్నారు. ఇది కేడర్‌కు ఏ సంకేతాలు అందిస్తుందో అధినేతకు తెలియదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
 
విజయవాడ :   తెలుగుదేశం పార్టీలో బలహీనవర్గాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో మరోమారు స్పష్టమైంది. అధినేత చంద్రబాబు సమక్షంలోనే పార్టీ అర్బన్ అధ్యక్షుడికి అవమానం జరిగిందంటూ ఆ పార్టీలోని కొందరు నేతలే ఆవేదన, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నగరంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసిన చంద్రబాబు అర్బన్ అధ్యక్షుడికి ఆ వేదిక మీద చోటుకల్పించకపోవడం ఏం సంప్రదాయమంటున్నారు. ఇది కేడర్‌కు ఎటువంటి సంకేతాలు అందిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
హెలెన్ తుపాను బాధిత రైతులను పరామర్శించేందుకు మంగళవారం రాత్రి జిల్లాలో పర్యటించి నగరానికి వచ్చిన చంద్రబాబు ఓ హోటల్‌లో బసచేశారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై చంద్రబాబుతోపాటు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని నాని, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌తోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆశీనులయ్యారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడికి మాత్రం చోటుదక్కలేదు.  దీంతో ఆయన ఒక పక్కన సాధారణ కార్యకర్తలతోపాటు నిల్చోవాల్సి వచ్చింది.

 కొత్తగా పార్టీ పగ్గాలు అప్పగించిన వ్యక్తికి సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన కూడా అధినేతకు లేకపోవడం పలువురు నేతల్ని, కార్యకర్తలను ఆశ్చర్యపర్చింది. అధినేత సమక్షంలోనే నగర శాఖ అధ్యక్షుడికి ఇటువంటి మన్నన మర్యాద లభించిందంటే రేపటి నుంచి ఆయన మాటకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఏం విలువ ఇస్తారనే ప్రశ్న ముందుకువచ్చింది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న అర్బన్ పార్టీని గాడిన పెట్టే ఆలోచన అధినేతకు ఏ మాత్రం లేదని కొందరు బహిరంగంగానే  విమర్శిస్తున్నారు. పార్టీలో బలహీనవర్గాల వారికి పదవిచ్చినా ప్రాధాన్యత ఇవ్వబోరని, పెత్తనం చేసే వారు వేరే ఉంటారని మరోమారు స్పష్టమైందని కొందరు నేతలు  వాపోతున్నారు.

 పరామర్శపై రైతన్న విమర్శ
 తుపాన్‌కు పంట తీవ్రంగా దెబ్బతిన్న తమను పరామర్శించే తీరు ఇదేనా అని జిల్లాలోని రైతన్నలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. అర్ధరాత్రి వేళ పర్యటించి పంట నష్టం గురించి ఆయన ఏం తెలుసుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కైకలూరు చేరుకున్న చంద్రబాబు అక్కడే విశ్రాంతి తీసుకుని బుధవారం పగటివేళ పొలాల్లో దెబ్బతిన్న పంటను పరిశీలించి, అన్నదాతలను పరామర్శించి ఉంటే బాగుండేదని తెలుగుదేశం శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
అలా కాకుండా ఆ చీకట్లోనే ముదినేపల్లి, గుడివాడ, గన్నవరం మీదగా మొత్తం 12 గ్రామాల్లో మొక్కుబడిగా పర్యటించి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన రాత్రి ఒకటిన్నరకు జరిగింది. అర్ధరాత్రి పొలాల్లో పంటలు దెబ్బతిన్న వైనాన్ని ఆయన ఎలా చూశారో ఎవరికీ అర్థం కాలేదు. ఇళ్ల వద్ద నిద్రపోతున్న రైతులను బలవంతంగా లేపి బాబు పర్యటనలో పాల్గొనేలా చేశారు. ఇలా ఆయన పంటనష్టం పరిశీలనంతా మమ అన్న రీతిలో సాగింది.

 ఆ రాత్రి నగరానికి చేరుకున్న చంద్రబాబు 11 గంటల వరకూ హోటల్ గదినుంచి బయటకు రాలేదు. తర్వాత గంటసేపు శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణాజిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. దానిలో చర్చంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపైనే జరిగినట్లు సమాచారం. ‘టికెట్లు మీకే ఇస్తాను. జాగ్రత్తగా పనిచేసుకోండి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయండి’ అంటూ నియోజకవర్గ ఇన్‌చార్జులను చంద్రబాబు ఆదేశించారు.

 వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని, కేడర్‌ను కాపాడుకోవాలని హితబోధ చేశారు. అందరికీ ఒకే తరహా ఉపన్యాసం తప్ప నియోజకవర్గ సమస్యలపై చర్చించలేదని, ఇటువంటి సమీక్షలు, సమావేశాల వల్ల ప్రయోజనం ఏమిటని ఆ పార్టీ నేతలే కొందరు పెదవి విరిచారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-will-not-change-his-stand-bc-leaders-in-party-84174
Share this article :

Post a Comment