Home » , , , , , » బాబు పాలన ఓ వెంటాడే విషాదం!

బాబు పాలన ఓ వెంటాడే విషాదం!


ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉచిత విద్యుత్తు ఇవ్వం పొమ్మన్నారు...నీటి ప్రాజెక్టులకు సొమ్ములు పెడితే వెనక్కి రావన్నారు.... వ్యవసాయమే దండగన్నారు...
బచావత్ అవార్డు గడువు ముగుస్తున్నా ముసుగు తన్నారు...
ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే చోద్యం చూశారు...
కరువు సమయంలో వ్యవసాయ రుణాల మాఫీ కాదుకదా... వడ్డీ మాఫీకి కూడా ఉత్తరం ముక్క రాసినది లేదు...ఎరువుల ధరలు పెరుగుతుంటే సబ్సిడీలు తప్పన్నారు...
విత్తనాల ధరలు భగ్గుమంటే మార్కెట్‌కు వదిలేశారు...
రైతులు వేలల్లో చనిపోతున్నా గాలికి వదిలేశారు...
తొమ్మిదేళ్ళు ఇలాంటి నేరాలూ ఘోరాలూ అసంఖ్యాకంగా చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా రైతుల కోసం కరువు యాత్ర చేస్తానంటున్నారు...
తాను ఆ తొమ్మిదేళ్ళలో చేసిన సామాజిక విధ్వంసానికి, పల్లెల సర్వనాశనానికి ఏనాడూ క్షమాపణ చెప్పని చంద్రబాబు ఇప్పుడు రైతు పోరుబాట ప్రారంభిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జ్ఞాపక శక్తిని అపహాస్యం చేస్తూ చంద్రబాబు మరో అఘాయిత్యానికి సిద్ధపడిన నేపథ్యంలో... నాటి వాస్తవాల సంక్షిప్త సంకలనం ఈ ‘ఏది నిజం’.

నేటి నుంచి చంద్రబాబునాయుడు రైతు పోరుబాట ప్రారంభిస్తున్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో, కరువును ఎదుర్కొనటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరున్నా... పోరాటం చేస్తానంటే అందుకు అభ్యంతరాలుగానీ, ఆక్షేపణలుగానీ ఉండవు. కానీ చంద్రబాబునాయుడి చరిత్ర ప్రత్యేకమైనది. ఆయన అభిప్రాయాలు ప్రత్యేకమైనవి. గడచిన పదహారేళ్లుగా ఆయన ఈ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి పదవిలోనో, లేదా ప్రతిపక్ష నాయకుడి హోదాలోనో ఉన్న వ్యక్తి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత గడచిన 64 ఏళ్ళలో ఏనాడూ కనీవినీ ఎరుగని కరువంతా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ళ కాలంలోనే తాండవించింది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్న ప్రాంతీయ భేదాలకు అతీతంగా... చివరికి కృష్ణా, గోదావరి పరీవాహ ప్రాంతాల్లో కూడా ప్రజలు పట్టెడన్నం దొరక్క వేరే రాష్ట్రాలకు వసలపోవటం, అనంతపురం జిల్లా రాజస్థాన్‌కు నకలుగా మారటమన్నది నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే జరిగింది.

ఇంకొద్ది లోతుగా విశ్లేషిస్తే... తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ గడచిన పదేళ్ళలో ఉవ్వెత్తుకు చేరిన ఉద్యమాల మూలాలన్నీ చంద్రబాబు పాలనలో కరువుల్లో, ఆ సమయాల్లో ఆయన విధానాల్లోనే కనిపిస్తాయి. ముగ్గురు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు... కె.చంద్రశేఖరరావు, దేవేందర్‌గౌడ్, నాగం జనార్దనరెడ్డి విభేదించినది ప్రధానంగా చంద్రబాబు విధానాలతోనే. ఈ రోజున తెలంగాణ జేఏసీకి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం మౌలిక పరిశోధనలు కరువును నిరోధించటంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా మహబూబ్‌నగర్ నుంచి మహారాష్ట్రకు సాగిపోయిన వలసలను కళ్ళకు కడతాయి. ‘పల్లె కన్నీరు పెడుతోంద’న్న గోరటి వెంకన్న గీతం... శ్మశానంగా మారిపోయిన మన పల్లెల సామాజిక చిత్రాన్ని, ఛిద్రమైపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థని కళ్ళకు కడుతుంది.

పగబట్టినట్టు పాలన


ఈ వాదనకు అర్థం చంద్రబాబు కారణంగానే కరువు వచ్చిందన్నది కాదు. కరవుకాటకాలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవటంలో నాటి పాలకుడిగా నారా చంద్రబాబునాయుడు ఎలాంటి పాత్ర పోషించారన్నదే ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవాల్సిన ప్రధానాంశం. 60 శాతం జనాభా వ్యవసాయం మీద, 70 శాతం ప్రజానీకం పల్లెల్లోనూ నివశిస్తున్న రాష్ట్రంలో... పేదరికమన్నది ప్రజలపాలిటి పెను శాపం. అదో సంకెళ్ళు తెగని విషవలయం. మనం నివసిస్తున్నది చేద్దామన్నా పని దొరక్క కోట్లమంది ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూసే సమాజం. ఇలాంటి సమాజంలో ప్రభుత్వం అర్థం చేసుకోవలసినది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మాత్రమే పాలన సాగించాలన్న అంశాన్ని. అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రజల మైండ్ సెట్టే మారాలన్నారు.

ప్రభుత్వాన్ని ఓ కంపెనీలా పరిపాలించాలన్నారు. లాభ నష్టాలను బేరీజు వేసుకున్నారు. అంతవరకు ప్రజలకు తెలియని యూజర్ ఛార్జీల కాన్సెప్టును ఇక్కడి ప్రజల సొమ్ముతో ఐరోపా, అమెరికాల చుట్టూ తెగతిరిగి మన ప్రజలమీదే ప్రయోగించారు. ఏనాడూ తరగతి గదిలో స్థిమితంగా కూర్చుని పాఠం వినలేదని గొప్పగా చెప్పుకున్న ఎమ్మే ఎకనామిక్స్ చంద్రబాబు, సబ్సిడీలే ఉండకూడదని ముఖ్యమంత్రిగా గద్దించారు. సబ్సిడీలు ఇవ్వటం పులి స్వారీ లాంటిదని తీర్మానించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారం అందుకున్నదే తడవు బియ్యం రేటును రెండు రూపాయలనుంచి మూడున్నరకు పెంచేశారు. ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం సంగతి దేవుడెరుగు... యూజర్ ఛార్జీలు ఎడాపెడా వడ్డించారు. మీ రోడ్లు మీరే వేసుకోమన్నారు. మీ ఊళ్ళో దొంగలుంటే మీరే పట్టుకోండన్నారు. ప్రభుత్వం పాత్ర తగ్గిపోతోందన్నారు. తాను సీఎంను కాదంటూ తనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమనే కంపెనీకి సీఈవోగా పత్రికల్లో రాయించుకుని మురిసిపోయారు. నీళ్ళు లేవు మహాప్రభో అంటే ఇంటింటా ప్రజలే తమ ఖర్చుతో తామే ఇంకుడు గుంత అనే తమ గోతిని తవ్వుకోవాలని తందాన పత్రిక సాయంతో ఉద్యమం నిర్వహించారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ (తన వారికి) అమ్మేశారు. ప్రభుత్వం పాత్ర రోజురోజుకీ తగ్గిపోతోందన్నారు. ప్రభుత్వోద్యోగాలు లేవు ఫొమ్మన్నారు. పెన్షనర్లకు పెంచిన డీఏ వర్తించదని, ఉద్యోగంలో ఉన్నవారికి పెన్షన్లే ఇవ్వబోమని హుంకరించారు. ఊరికి ఇన్ని అంటూ మొక్కుబడిగా పింఛన్లు ప్రకటించి... వృద్ధులను, వితంతువులను క్యూలో పెట్టి ముందు వరసలో ఉన్న ఎవరైనా చనిపోతే మాత్రమే తరవాతి వారికి ఆ రూ.75 అదృష్టం వరిస్తుందని అమానుషంగా వ్యవహరించినది కూడా ముఖ్యమంత్రిగా ఈ చంద్రబాబు నాయుడే. అదీ అత్యంత భయానకంగా కరువుకాటకాలు తాండవించిన 2000-2004 మధ్య కాలంలో.


చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సంవత్సరాల్లో కరువు రావటం ఆయన దురదృష్టమా... లేక కరువు సంవత్సరాల్లో చంద్రబాబు లాంటి వ్యక్తులు అధికారంలో ఉండటం ప్రజల దురదృష్టమా అన్న విషయంలో ఆ కష్టాలేవో స్వయంగా అనుభవించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్థిరమైన అభిప్రాయాలున్నాయి- మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులకు. వ్యవసాయమే దండగ అని... వ్యవసాయానికి విద్యుత్తు ఉచితంగా సరఫరా చేస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకునే దండేలుగా మాత్రమే ఉపయోగపడతాయని ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యానాలు ఏనాటికీ మరిచిపోలేనివే. అంతకు మించి, తనకు తానుగా బాబు రాసుకున్న శాసనం ‘‘మనసులో మాట’’ అనే పుస్తకం.

అందులో, కరువు అత్యంత తీవ్రంగా ఉన్న సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు రైతుల పట్ల వ్యక్తం చేసిన అసహనాన్ని, ఆయన మాటల్లోనే పైనున్న బాక్సుల్లో ఇచ్చాం. ఈ స్టేట్‌మెంట్లు తాను ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు నమ్మి, ప్రకటించే పక్షంలో... ఆయనకు దరువు వేయటమే పనిగా పెట్టుకున్న పత్రిక ప్రచురించిన సంబంధిత వార్తా కథనాలను విడుదల చేయటానికి ‘సాక్షి’ సిద్ధం. వ్యవసాయానికి సంబంధించి చంద్రబాబుకు ఉన్న చులకన ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయన చూపిన నిర్లక్ష్యం మొదలు నీటి తీరువా పెంచాలని, ప్రాజెక్టులు నిర్మిస్తే పెట్టిన పెట్టుబడి ప్రభుత్వానికి తిరిగిరాదని... తన పుస్తకంలో రాసుకున్న దుర్మార్గపు రాతల వరకు అడుగడుగునా నిర్ద్వంద్వంగా నిరూపణ అవుతోంది. వ్యవసాయ దేశంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని దార్శనికులైన పాలకులు ఓ జాతీయావసరంగా భావిస్తుంటే చంద్రబాబు మాత్రం వాటిలోనూ పైసల లెక్కలకు తెగించారు. ఫలితంగానే ఆయన హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం నేరపూరితమైన నిర్లక్ష్యానికి గురయింది.

బచావత్ అవార్డు 2000 సంవత్సరం వరకు కృష్ణా జలాల వినియోగంలో ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు మెరుగైన అవకాశాలను ఇస్తే... 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మన రాష్ట్రంలో భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణంమీద మమకారమే లేకుండా పాలన సాగించారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్‌లో చంద్రబాబు బిచ్చం విదిలించినట్టు నిధులు కేటాయిస్తున్న ఈ సంవత్సరాల్లోనే ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కడికక్కడ నీటిని బిగబట్టేలా ప్రాజెక్టులు కట్టేసుకున్నాయి. తదుపరి ట్రిబ్యునల్ ఏర్పాటయ్యేలోపు... తమ రాష్ట్రాలనుంచి సాధారణ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు నీరు పారకుండా కట్టలు నిర్మితమయ్యాయి. ఈ కాలంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాలను తానే శాసిస్తున్నానన్న మత్తులో జోగుతుంటే, నిద్రపోవటానికి ప్రసిద్ధుడైన దేవగౌడ తన రాష్ట్రానికి కేంద్ర(ఏఐబీపీ) నిధులను భారీగా తరలించుకుపోయారు.

మిగతా రాష్ట్రాలు అక్రమంగా నీటిని బిగబడుతున్నాయంటూ అప్పటి తెలుగుదేశం అధినేత మీడియా ముందు తాటాకు చప్పుళ్ళే తప్ప ఓ ఆలమట్టిని ఆపినది లేదు... శ్రీరాం సాగర్‌ను రక్షించినది లేదు... తన సొంతగడ్డ రాయలసీమలో ఓ చినుకును పట్టి నిలిపేలా ఇటుకలు పేర్చినదీ లేదు. ఎందుకంటే ఆయన ఆలోచనలన్నీ మలేసియా, సింగపూర్, దుబాయ్‌ల చుట్టూ తిరుగుతున్నాయి. విజన్ 2020 అని, మెకెన్సీ కంపెనీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు... వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల కోసం దావోస్ పర్యటనలు... హైదరాబాద్‌లోనే పార్ట్‌నర్‌షిప్ సమిట్‌లు... విదేశీ ప్రముఖులను ఆహ్వానించి వారంతా తన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారని పత్రికల్లో రాయించుకోవటాల్లోనే చంద్రబాబు నిమగ్నమయ్యారు. ఒక్క దావోస్‌కే ఆయన ఏడేళ్ళలో అయిదు పర్యాయాలు ప్రయాణించారంటే ఆయన ప్రాధాన్యాలు అందులోనే వెల్లడవుతున్నాయి.

ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు రిపోర్టుల్లో మెచ్చుకుంటాయంటే చాలు... మన సమాజాన్ని సంస్కరణల పేరుతో ఎంతైనా ధ్వంసం చేయటానికి చంద్రబాబు ఏమాత్రం వెనుకాడని రోజులవి. పారిశ్రామిక, అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం వాటా జీడీపీలో చాలా తక్కువగా ఉంటుందంటే దాని అర్థం అక్కడ సేవా రంగం, పారిశ్రామిక ఉత్పాదనల వాటా బాగా పెరిగి వ్యవసాయంమీద ఆధారపడిన జనాభా కాల క్రమంలో తగ్గుతూ వచ్చిందన్నది. అంతేగానీ వ్యవసాయ రంగాన్ని తగ్గించటాన్ని అభివృద్ధిగా ఏ సమాజమూ భావించదు. చంద్రబాబు మైండ్‌సెట్‌కు సంబంధించి బహుశా సమస్య ఇక్కడే ఉంది. దావోస్‌లలోను, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల ముందు తాను చులకన కాకుండా ఉండేందుకు చంద్రబాబు ఏకంగా మన రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని చిన్నది చేసే దారుణమైన ప్రయోగానికి తెగబడ్డారు. ఫలితంగానే ప్రకృతి ఆగ్రహమైన కరువుకు చంద్రబాబు ఆర్థిక విధానం ఆజ్యంలా తోడై ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ వ్యవస్థే సాంతంగా తగలబడిపోయింది.

శిలా ఫలకాలతో సరి!

ఇలాంటి విమర్శలు భారీగా వస్తున్న నేపథ్యంలోనూ చంద్రబాబు ప్రజలను మభ్యపుచ్చటానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఉదాహరణకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి శిలాఫలకాలు వేయటంలో ఆయన ఓ రికార్డు నెలకొల్పారు. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ అదే కౌటిల్యం. వందల కోట్లు కేటాయిస్తామన్నారు తప్ప బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు తప్ప విడుదలకు ఖజానాలో నిధులు ఉండవు. అన్నింటికీ మించి ప్రాజెక్టులకు అనుమతులే ఉండవు. అందుకోసం ఆయన తనకు అనుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వాలకు ఓ కాగితం ముక్క కూడా రాయరు. ఇదే విషయం అప్పటి కేంద్రమంత్రి సేథీ ప్రకటన ద్వారా చంద్రబాబు బట్టలు విప్పినట్టయింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదంటూ చంద్రబాబు ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపైకి తోసేందుకు ఓ ప్రయత్నం చేసినప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అర్జున్ చరణ్ సేధీ 2002 సెప్టెంబర్ 23న ఓ విస్పష్ట ప్రకటన చేశారు. ‘ మీ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకుంటామంటే కావలసిన అనుమతులన్నీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నా’మంటూ సేధీ అప్పట్లోనే స్పష్టం చేసినా... ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏ ప్రాజెక్టులకూ అనుమతులు సంపాదించినది లేదు. ఇంటా బయటా రూ.57,000 కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించటానికి సొమ్మును సద్వినియోగం చేయలేదని ప్రణాళికా సంఘానికి చెందిన ఎస్‌ఈఆర్ విభాగం అప్పట్లోనే నిగ్గుదేల్చింది.

మద్దతు ధర ఊసే లేదు

పోనీ కేంద్ర ప్రభుత్వంలో అధికార పక్షాన్ని శాసిస్తున్న చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రైతుకు మేలు చేకూరేలా వరికి కనీస మద్దతు ధరను భారీగా పెంచగలిగారా అంటే అదీ లేదు. 1995-96లో వరికి మద్దతు ధర రూ.360 ఉంటే... ఆయన మొదటి విడత పాలన పూర్తయ్యేసరికి-1999-2000లో అది రూ.490కి పెరిగింది. ఆ తరవాత అయిదేళ్ళలో మరో డెబ్భై రూపాయలు మాత్రమే పెరిగింది. అంటే చంద్రబాబు పలుకుబడి మన రైతులకు ఏ స్థాయిలో ఉపయోగపడిందో వెల్లడవుతూనే ఉంది. మరోవంక ఎరువుల ధరలను, పెట్రో ధరలను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానించి ప్రజల జేబులు ఖాళీ చేసే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తెగబడిందీ చంద్రబాబు హయాంలోనే.

వడ్డీ మాఫీ కూడా అడిగినది లేదు

2000 నుంచి భయానకమైన కరువు రైతులను ముట్టడిస్తుంటే... అదే సమయంలో సహకార సంఘాలు, బ్యాంకులమీద రుణాల వసూళ్ళకు వత్తిడి పెంచినదీ బాబు హయాంలోనే. రుణాల వసూళ్ళు ఆపండని ప్రతిపక్షాలు చేతులు జోడించి అర్థించినా తనకు బాధ్యత లేదన్నట్టు చంద్రబాబు ప్రవర్తించటాన్ని ఏ రైతు మరువగలడు? సాంతంగా రుణాలు, వడ్డీలు మాఫీచేసి రైతును, మొత్తంగా గ్రామీణ సమాజంలో అతనిమీద ఆధారపడి జీవించే సహస్ర వృత్తులను ఎలా బతికించుకోవాలన్న ఆలోచనే ఉంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చేవారు. ఇప్పుడ స్వామినాథన్ సిఫారసులను ఆమోదించాలని, వరి రైతుకు ఎకరానికి రూ.10,000 చొప్పున పరిహారం అందించాలని సిఫారసు చేస్తున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అసలు సంగతి సరే... కనీసం వడ్డీ మాఫీ చేయండని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం ముక్క రాసిన పాపాన పోలేదు.

సాగునీరు లేక గ్రామ కక్షలు

సాగునీరు చాలక గ్రామాలు, జిల్లాల రైతుల మధ్య కక్షలు, కార్పణ్యాలు హద్దులు మీరి బాంబులూ కత్తులతో దాడులు చేసుకున్న దారుణమైన రోజులూ చంద్రబాబు పాలనలోనివే. ఇంతెందుకు... రైతుకు తనవల్ల ఫలానా మేలు జరిగిందని చెప్పే సాహసమే చంద్రబాబుకు లేకపోయింది. అయినా ఈ రోజున చంద్రబాబు కరువు యాత్రకు బయల్దేరారంటేనే ఆయనకు గడచిన ఏడేళ్ళుగా ఏం కరువయినదీ అర్థమవుతూనే ఉంది. అందరినీ కలకాలం మోసం చేయవచ్చన్న చంద్రబాబు నమ్మకమే ఆయన మనస్తత్వాన్ని మరోసారి వెల్లడిస్తోంది.

బాబు చరిత్రహీనుడే..

2000 నాటికే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు ముగుస్తోంది. 1978 నుంచి అటు కాంగ్రెస్ పార్టీలో, ఇటు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా... ఆ తరవాత సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. ఆయన బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం రాష్ట్రానికి లభించే నీటిని ఉపయోగించుకుని ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం చేయలేదు. కేసీ కెనాల్ పనులు చేపట్టలేదు. గండికోట ప్రాజెక్టును తానే ప్రారంభించినట్టు చంద్రబాబు చెప్పుకొంటున్నా... దాన్ని పూర్తి చేయటంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారు? బాబు ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేసింది. అందువల్లే హంద్రీ-నీవాపై ప్రజా ప్రతిఘటన వచ్చింది.
- 2002 డిసెంబరు 6న- అప్పటి కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీ నేత ఎం.వి.మైసూరారెడ్డి.

రాష్ట్రంలోనే కాదు... దేశంలోనూ, ప్రపంచంలోనూ విద్యుత్తు కోత ఉంది. అమెరికాలో కూడా విద్యుత్తు కోత ఉంది.
-2002 జూలై 17న శాసన సభలో తెలుగుదేశం నేత బుచ్చయ్య చౌదరి.

Share this article :

Post a Comment