Home » , , , , , , » బురిడీ కొట్టించే యత్నాలు

బురిడీ కొట్టించే యత్నాలు

చంద్రబాబుకు మస్కా!
సాక్షి ప్రతినిధి, గుంటూరు :‘ఇంటింటికీ దేశం’ కార్యక్రమంలో జిల్లా నేతలు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు మస్కా కొట్టారు. పార్టీకి దూరమైన నాయకులను కలుపుకునేందుకు, కొత్తవారిని చేర్చుకునేందుకు, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని నామమాత్రంగా చేపట్టారు. అధినేత ఎంతో పటిష్టంగా రూపకల్పన చేసిన ఈ కార్యక్రమాన్ని  నేతలు భ్రష్టు పట్టించారనే విమర్శలు లేకపోలేదు. సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో కొంత వరకు జరిగినా, మిగిలిన నియోజకవర్గాల్లో చడీచప్పుడు లేకుండా ముగిసింది. నవంబరు 15 నుంచి ఈ నెల 25 వరకు జరిగిన ఈ కార్యక్రమం దినపత్రికల్లో ఫొటోలకు పరిమితం అయింది.
 
 వార్తలకు సంబంధించి దినపత్రికల కటింగ్‌లను  పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపి జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిందనే భ్రమ కల్పించారు. మొత్తం 40 రోజుల్లో పార్టీకి దూరమైన ముఖ్య నేతలను కలుపుకునే ప్రయత్నాలుగానీ, ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలను టీడీపీలో చేర్చుకున్న దాఖలాలుగానీ లేవు. దీనికితోడు పార్టీకి సహకరించడం లేదనే కారణం చూపి 15 మందిని సస్పెండ్ చేయాలని తూర్పు ని యోజకవర్గ నేత తీసుకువచ్చిన ప్రతిపాదనపై సీనియర్లు మండిపడుతున్నారు. జిల్లాలో 17 అసె ంబ్లీ నియోజకవర్గాల్లో ఐదారింటి లో కూడా నేతలు దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టలేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సైతం తన చిలకలూరిపేట నియోజకవర్గంలో నామమాత్రంగానే చేపట్టినట్టు తెలుస్తోంది. మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఎక్కువగా కార్యక్రమాన్ని చేపట్టలేదని, అధినేత సూచించిన విధంగా రాత్రి వేళ కార్యకర్తల నివాసాల వద్ద విశ్రాంతి తీసుకుని మర్నాడు అక్కడి నుంచే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటే, ఆ విధంగా జరగలేదని కార్యకర్తలే చెబుతున్నారు.
 
 దండిగా కరపత్రాలు,పోస్టర్లు
 పెదకూరపాడు నియోజకవర్గంలో కొమ్మాలపాటి శ్రీధర్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టకుండా, దానితోపాటు ఒకటి రెండు కార్యక్రమాల్ని మండలాల్లో ఏర్పాటు చేసుకుని అన్నింటినీ పూర్తిచేసి, వాటన్నింటినీ ఇంటింటికీ దేశం కార్యక్రమంగా వాడుకున్నట్టు తెలుస్తోంది. క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లోని పెద్ద గ్రామాల్లో చేపట్టి, బెల్లంకొండ వంటి దూరాభారమైన ప్రాంతాల దరికి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లలేదని తెలుస్తోంది. కరపత్రాలు, పోస్టర్లు మాత్రం దండిగా నియోజకవర్గంలో కనపడే విధంగా చేశారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో నియోజకవర్గంలో ఐదారు డివిజన్లకు మించి ఈ కార్యక్రమం జరగలేదని తెలుస్తోంది. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌ఎం జియావుద్దీన్ పర్యటించిన రాజీవ్‌గాంధీ నగర్‌లో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఒక మహిళ ఆయన చాలా రోజుల తరువాత డివిజన్‌కు రావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. మీరంతా మమ్మల్ని పట్టించుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చేరిపోయామని, మేం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని స్థితిలో నేతలున్నారని ఆమె వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
 
 బురిడీ కొట్టించే యత్నాలు
 కొంతమంది నేతలు అధినేతను బురిడీ కొట్టించే యత్నాలు చేశారు. ఇంటింటికీ దేశం కార్యక్రమాన్ని ఒక డివిజన్‌లో చేపట్టినప్పుడు ఆ కార్యక్రమాన్ని నాలుగైదు యాంగిల్స్‌లో ఫొటోలు తీసి, వాటిని రెండు మూడు రోజులపాటు దినపత్రికలకు పంపి ప్రచురితం అయ్యే విధంగా చేశారనే ఆరోపణలు లేకపోలేదు. దినపత్రికల కటింగ్స్‌ను పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీకి నేరుగా పంపి, తాము జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేసినట్టు బిల్డప్ ఇచ్చారని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు.కొత్త, పాత చేరికలు లేవు.. ఈ కార్యక్రమం ద్వారా కొత్తవారిని, స్వల్ప వివాదాల కారణంగా పార్టీని వీడిన వారిని చేర్చుకోవాలని అధినేత సూచించారు. అయితే అటువంటి ప్రయత్నాలు పెద్దగా జరగకపోగా, పశ్చిమ నియోజకవర్గంలో తనను వ్యతిరేకిస్తున్న 15 మంది నేతలపై చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జియావుద్దీన్ డిమాండ్ చేస్తున్నారు. ఉన్నవారినీ వదులుకుంటే పార్టీ బతికేదెలా అని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. 

http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-leaders-not-attending-chandrababu-naidu-dream-programme-in-guntur-district-91999?pfrom=home-top-story
Share this article :

Post a Comment