కిరణ్, చంద్రబాబు తీరుపై సర్వత్రా విస్మయం
శాసన వ్యవస్థను కించపరిచేలా సభా ‘నాయక్’, ‘ప్రతినాయక్’ల తీరు
బీఏసీ భేటీ జరిగే స్పీకర్ చాంబర్‌కు పదడుగుల దూరంలో ఇద్దరి చాంబర్లు
సమావేశం జరిగే సమయంలో ఎవరి గదుల్లో వాళ్లు కూర్చుని కాలక్షేపం
రెండుసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోని సీఎం, విపక్ష నేత
ఈ సమావేశాల్లో నాలుగుసార్లు జరిగిన బీఏసీ భేటీ
ఒక్కసారీ వెళ్లని బాబు.. ఒకేసారితో సరిపెట్టిన ముఖ్యమంత్రి కిరణ్
వెళ్తే టీ బిల్లుపై వైఖరి చెప్పాల్సి వస్తుందన్న భయమే కారణం?
టీడీపీ నుంచి ఇద్దరు ప్రతినిధులు, బాబు స్క్రిప్టు మేరకు రెండు వాదనలు
సాక్షి, హైదరాబాద్: శాసన వ్యవస్థ అంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుల్లో తేలిక భావం నెలకొని ఉందా? శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) అంటే వారికి పూర్తి చులకన భావముందా? బీఏసీ సమావేశాలను తేలిగ్గా తీసుకుంటున్నారా? వాటిని ఆషామాషీ వ్యవహారాలుగా మాత్రమే పరిగణిస్తున్నారా? స్వయంగా శాసనసభాపతి అయిన స్పీకర్ నిర్వహించే ఆ సమావేశాలకు ఇవ్వాల్సినంత విలువ ఇవ్వడం లేదా? వాటిలో తాము పాల్గొనడం ఏమిటన్న తరహాలో చిన్నచూపు చూస్తున్నారా? వారి వ్యవహార శైలి పట్ల ప్రస్తుతం సర్వత్రా ఇలాంటి సందేహాలే తలెత్తుతున్నాయి. కొంతకాలంగా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు శాసనసభకు వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న బీఏసీ సమావేశాలను బాబు, కిరణ్ ఏమాత్రం ఖాతరు చేయకపోవడం పట్ల అసెంబ్లీ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది.
సభ ఏ అంశంపై చర్చించాలి. ఎలాంటి ఎజెండాను ఖరారు చేయాలన్నది నిర్ణయమయ్యేది బీఏసీలోనే. పైగా ఈ విషయాల్లో సభా నాయకుడైన ముఖ్యమంత్రిది, ప్రధాన ప్రతిపక్ష నాయకునిదే కీలక పాత్ర. వారి సూచనలనే బీఏసీలో ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. అలాంటిది కొంతకాలంగా బీఏసీని వారు అసలే పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా స్పీకర్ ఇప్పటికి నాలుగు దఫాలుగా బీఏసీ నిర్వహించగా కిరణ్ ఒకే ఒక్కసారి హాజరయ్యారు. చంద్రబాబు అయితే అదీ లేదు! అది కూడా అసెంబ్లీలోనే ఉండి మరీ డుమ్మా కొడుతున్నారు. పోనీ ఏమైనా అత్యవసర పనుల్లో బీజీగా ఉంటున్నారా అంటే, అదీ లేదు. అసెంబ్లీ భవనంలో బీఏసీ భేటీ జరిగే స్పీకర్ చాంబర్‌కు ఒకవైపు సీఎం గది, మరోవైపు ప్రతిపక్ష నాయకుడి గది ఉంటాయి. స్పీకర్ చాంబర్ నుంచి వాటికి పదడుగుల దూరం కూడా ఉండదు. కిరణ్, బాబు ఇద్దరూ తమ చాంబర్లలో నేతలతో, ఇతరులతో ఇష్టాగోష్ఠి వంటివాటితో కాలక్షేపం చేస్తున్నారు. పైగా స్పీకర్ చాంబర్‌లో బీఏసీ భేటీలో ఏం జరుగుతున్నదీ ఎప్పటికప్పుడు పార్టీ నేతల ద్వారా వాకబు చేస్తూ, వారికి డెరైక్షన్లిస్తూ గడుపుతున్నారు. విభజన బిల్లుపై ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై కిరణ్, బాబు అభిప్రాయం తెలుసుకోవాలని మిగతా పార్టీలన్నీ ఎదురుచూస్తుంటే, వారు మాత్రం తనకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. నిజానికి బీఏసీ భేటీకి వస్తే తమ వైఖరేమిటో స్పష్టం చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వారిలా డుమ్మా కొడుతున్నారన్న అభిప్రాయం కాంగ్రెస్, టీడీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.
లోపల అలా, బయట ఇలా
కిరణ్, బాబు పదేపదే బీఏసీకి డుమ్మా కొట్టడంపై అన్ని పార్టీల నుంచీ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సభా నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వంటి బాధ్యత కలిగిన హోదాల్లో ఉంటూ కూడా బీఏసీకి డుమ్మా కొట్టడమే గాక, వారు అనుసరిస్తున్న వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. వారి ధోరణిని శాసన వ్యవస్థను కించపరచడంగానే పరిగణించాల్సి ఉంటుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ప్రస్తుత శీతాకాల అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని డిసెంబర్ 11న స్పీకర్ బీఏసీ సమావేశం నిర్వహించారు. అప్పటికింకా విభజన బిల్లు రాష్ట్రానికే రాలేదు. అయినా కిరణ్, బాబు బీఏసీకి రాలేదు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చాక దానిపై అన్ని పార్టీలతో సంప్రదించి ఎజెండాను ఖరారు చేయడానికి స్పీకర్ రెండో దఫా డిసెంబర్ 17న మరోసారి బీఏసీ నిర్వహించారు. అందులో కిరణ్ పాల్గొన్నాబాబు మాత్రం మళ్లీ డుమ్మా కొట్టారు. పక్కనే ఉన్న తన చాంబర్‌లో కాలం గడిపారు. అప్పటికి విభజన బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైనట్టా, లేదా అన్న వివాదం నడుస్తోంది. మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ బీఏసీలో దీనిపై ప్రశ్నించగా, ‘అయిందేదో అయింది. దాన్ని వివాదం చేయొద్దు’ అని కిరణ్ కోరారు! అసలు చర్చ ప్రారంభమే కాలేదని సీమాంధ్ర నేతలు చెబుతున్న ఆ దశలో కిరణ్ అలా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ భేటీలో అంగీకరించిన మేరకు జనవరి 3వ తేదీ నుంచి మలివిడత సమావేశాలు ఉంటాయంటూ ముఖ్యమంత్రి పేరుతో షెడ్యూలు కూడా విడుదల చేశారు. కానీ అలాంటిదేమీ తనకు తెలియదని ఆ మర్నాడే మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిరణ్ చెప్పుకొచ్చారు. ఒకవైపు బీఏసీకి డుమ్మా కొడుతూ, ఇలా పాల్గొన్న ఒక్కసారి కూడా విభజన బిల్లు వంటి కీలకమైన అంశంపై చర్చ, షెడ్యూలు విషయాల్లో లోపల ఒకమాట, బయట ఇంకో మాట మాట్లాడటం ఏమిటంటూ సీనియర్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
చాంబర్లలో టైమ్‌పాస్
జనవరి 3న అసెంబ్లీ మలివిడత సమావేశాలు మొదలైనా మూడు రోజులుగా సభ సాగకపోవడంతో స్పీకర్ సోమవారం మరోసారి బీఏసీ నిర్వహించారు. దానికి కూడా కిరణ్ , బాబు యథాప్రకారం డుమ్మా కొట్టారు. పైగా ఎప్పట్లాగే ఆ సమయంలో తమ చాంబర్లలో పార్టీ నేతలతో ఇష్టాగోష్ఠుల్లో మునిగిపోయారు. బీఏసీ నుంచి మధ్యమధ్యలో ఆయా పార్టీల నేతలు తమ వద్దకు వచ్చి వివరాలు చెబుతుంటే వారికి డెరైక్షన్లు ఇస్తూ గడిపారు. సోమవారం బీఏసీ రెండు దఫాలుగా జరిగింది. ఉదయం జరిగినప్పుడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదన్న ఉద్దేశంతో మధ్యాహ్నం తర్వాత స్పీకర్ మరోసారి బీఏసీ నిర్వహించారు. ఈ రెండుసార్లూ కిరణ్, బాబు తమ చాంబర్లలో నేతలతో కాలక్షేపం చేస్తూ గడిపారే తప్ప అటువైపు తొంగి కూడా చూడలేదు. బీఏసీలో మిగతా పక్షాలు ఏమేం మాట్లాడుతున్నదీ తెలుసుకుంటూ, టీడీపీ తరఫున ఏం మాట్లాడాలో నేతలకు సూచనలిస్తూ బాబు తన చాంబర్ నుంచే కథ నడిపారు. ‘ప్రాంతాలవారీగా మీ మీ వాదన గట్టిగా వినిపించండి’ అని బీఏసీకి వెళ్లిన తెలంగాణ, సీమాంధ్ర టీడీపీ నేతలకు ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. ఇలా కీలకమైన సభా నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఇద్దరూ బీఏసీలో లేకపోవడంతో బిల్లుపై చర్చను కొనసాగించే విషయంలో సమావేశం ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి రెండు దఫాలుగా మూడున్నర గంటలపాటు చర్చించినా ఏమీ తేల్చకుండానే ముగించాల్సి వచ్చింది.
బాబుకు ఎన్ని నాల్కలో...
బాబు డుమ్మా కొడుతున్న నేపథ్యంతో అసలు విభజన బిల్లుపై, దానిపై చర్చ కొనసాగించడంపై టీడీపీ వైఖరేమిటో స్పష్టం చేయాలంటూ సోమవారం జరిగిన బీఏసీలో మిగతా పార్టీల నేతలంతా సూటిగా ప్రశ్నించారు. దాంతో టీడీపీ నేతలు నీళ్లు నమిలారు. దీనిపై తమకు కొంత సమయం కావాలని కోరారు!దాంతో బీఏసీలో పాల్గొన్న మిగతా పార్టీల నేతలంతా ఒక్కసారిగా విస్తుపోయారు. ఒక పార్టీగా స్పష్టమైన అభిప్రాయంతోనే సమావేశానికి రావాలి కదా అంటూ వారిని నిలదీశారు. ఇలా టీడీపీ ప్రదరిశంచిన నీళ్లు నములుడు వ్యవహారం వల్లే బీఏసీ భేటీని మధ్యాహ్నానికి స్పీకర్ వాయిదా వేశారు. మళ్లీ సమావేశమయ్యాక టీడీపీ సభ్యులు షరామామూలుగా ప్రాంతాలవారీగా అభిప్రాయం విన్పించారు! విభజన బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనందున దాన్ని వెంటనే తిప్పి పంపాలన్నదే టీడీపీ అభిప్రాయమని అశోక్‌గజపతిరాజు, గాలి ముద్దు కష్ణమనాయుడు చెప్పారు. తామడిగిన సమాచారం ఇచ్చేదాకా అసలు సభనే సాగనీయబోమని పయ్యావుల కేశవ్ తెలిపారు.
తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగాల్సిందేనని, అవసరమైతే అడ్డొచ్చే వారిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు! దాంతో విస్తుపోవడం మిగతా నేతల వంతయింది. ‘అసలు మీరు చెబుతున్న అభిప్రాయాల్లో ఏది మీ పార్టీ అభిప్రాయమో చెప్పండి’ అంటూ స్పీకర్ సహా అధికార, విపక్ష సభ్యులంతా గట్టిగా నిలదీశారు. అప్పుడు కూడా టీడీపీ నేతలు యథాప్రకారం రెండు కళ్ల సిద్ధాంతం పఠించారు. ‘టీడీపీ తరపున బాబు, నేను మాత్రమే బీఏసీ సభ్యులం. కాబట్టి నేను చెప్పిందే మా పార్టీ విధానం’ అని అశోక్ చెప్పారు. విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చింది గనుక దానికి అనుగుణంగా చర్చ జరపాల్సిందేనని మోత్కుపల్లి నర్సింహులు చెప్పుకొచ్చారు. బీఏసీ సమావేశాల్లో నేతలు రకరకాలుగా మాట్లాడుతుండటం, పైగా లోపల ఒకటి చెప్పి, బయటకెళ్లగానే మరో రకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో భేటీలో సభ్యులు వ్యక్తం చేసే అభిప్రాయాలను రికార్డ్ చేయాలని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పీకర్‌ను కోరారు. అయినా టీడీపీ నేతలు ఎవరి వాదన వారు వినిపిస్తుండటంతో ఏకాభిప్రాయం రాక చివరకు స్పీకర్ మళ్లీ బీఏసీని వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా టీడీపీ నేతలు మీడియా పాయింట్ వద్ద ఎవరి వాదనలు వారు విన్పించడమే గాక ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించారు!
సభలోనే అభిప్రాయాలు తెలుసుకోవాలి: బొత్స
విభజన బిల్లుపై చర్చ జరగాలా, వద్దా అనే అంశంపై బీఏసీలో కాకుండా ఇకపై అసెంబ్లీలోనే ఫ్లోర్‌లీడర్ల అభిప్రాయాన్ని తీసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ స్పీకర్‌కు సూచించారు. ‘బీఏసీలో సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాక కూడా కొందరు బయట మాట మారుస్తున్నారు. సభను అడ్డుకుంటున్నారు’ అని గాంధీభవన్‌లో మీడియాతో ఆయనన్నారు. సభలోనే అభిప్రాయాలను తీసుకోవడంవల్ల ఎవరేమిటో ప్రజలకు తెలుస్తుందన్నారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-and-kiran-kumar-playing-games-95107?pfrom=home-top-story
+ comments + 1 comments
రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ మరియు బాగా డబ్బులు సంపాయించాలి అని ఆకలి తో వున్నా కెసిఆర్ తెలంగాణా పార్టీ తో జాగ్రత్త గా వుండండి .
మార్పు జనం తోటే సాద్యం(powrudu.blogspot.com)
ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .
బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .
పౌరిడిగా వక చిన్న ప్రయత్నం
ఈ బ్లాగ్ ని చదవండి .మీ రచనలు ఈ ఫోరం లో ముద్రించండి .
దయచేసి ఈ బ్లాగు ని మీ సైట్ కి జతచేయండి
Post a Comment